TeluguBrains

Poetry from Members

Home
Teams Information
In Media
Telugu Software
OPMS
Poetry from Members
Stories from Members
Dramas from Members
Telugu Excel Templates
Moral Stories
Translated Stories
Mail to Govt Departments
Important Links

నింగి – నేల

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

అది డిపార్చర్ లాంజ్
అందరి మొహాల్లోనూ విషాధ ఛాయలు
ఫైనల్ కాల్ టు ప్యాసింజర్స్ ఆఫ్
ఫ్లైట్ నెంబరు సో అండ్ సో
ఫర్ సెక్యూరిటీ చెక్
విమానం నింగికి ఎగిరాక
చిన్న చుక్కై ఆనక అదౄశ్యమయ్యాక
ముక్కు చీదుకుంటూ
కళ్ళు తుడుచుకుంటూ
భారమైన హౄదయాలతో
తిరోగమనం

అది అరైవల్ లాంజ్
విప్పారిన మొహాలతో
కళ్ళల్లో ఉత్సాహం పొంగుతూవుంటే
ఫ్లైట్ దిగిన ఒక్కొక్కరే వస్తూవుంటే
ఆతౄతగా తమవారికోసం
తలల వెనక
మునిగాళ్ళపై నిల్చుని చూస్తూవుంటే
అదిగో తళుక్కుమంది తార
హాయ్ హాయ్ పలకరింపులు
ఆప్యాయతతో కౌగలింతలు
ఆనందాశ్రువుల ధారలు
ఉత్సాహంతో ఇంటికి
నింగి విషయం మర్చిపోయి 

*************************************


వసంత హేల (గేయం)
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

నా మనసులోని మనసా
ఏమిటే నీగుసగుస

(1)

ప్రకృతి పరవిశించువేళ
చల్లగాలి వీచుచుండ
మందారపు మకరందం
భ్రమరమారగించువెళ

నా మనసులోని మనసా
ఏమిటే నీగుసగుస

(2)

కొమ్మమీద కోయిలమ్మ
గున్నమామి చిగురుమేసి
కమ్మని కిలరావంతో
గళమెత్తి పాడుతుంటె

నా మనసులోని మనసా
ఏమిటే నీగుసగుస

(3)

మధుమాసం వచ్చింది
అందాలను చిందింది
ప్రకృతిలో అణువణువు
పులకరింత నిస్తూంటె

నా మనసులోని మనసా
ఏమిటే నీగుసగుస 

నా మనసులోని మనసా
ఏమిటే ..నీ ..  గుస ..   గుస 
 
**********************************************************

 

 

వూహాతీతం (కవిత)
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

అప్పుడే పుట్టిన బిడ్డను
అక్కున చేర్చుకున్న
మాతృమూర్తి పరవశత్వంలో
నవమాసాలూ మోసిన కస్టాలు
కరిగిపోయాయి

తూగుటుయ్యలలో కేరింతలలో
తపటడుగుల తడబాటులో
ముద్దుమురిపాలలో
ఆ ఆనందం అద్భుతం

అమ్మా ఫస్టుక్లాస్ లో ప్యాసయ్యా
అని సంతోషంగా చెప్పిన కొడుకును
ఆలింగనం చేసుకొన్న అనుభూతిలో
తళుక్కుమంది బిడ్డ భవిష్యత్తు

దేశమాతసేవలో
సరిహద్దు రక్షణలో
అసువులు బాసిన తనయుని
అచేతన దేహాన్ని తాకి
నుదుటిపై పెట్టిన ముద్దు
ఆ బుగ్గపై పడ్డ
ఆపుకోలేని కన్నీటి చుక్కలు
చెప్పే భాష్యం
ఆ తల్లి ఆవేదనా??
బిడ్డ త్యాగానికి నిర్వచనమా??
 
అది నిజంగ వూహాతీతమే

జై హింద్ 

********************************************************** 


 

నాదొక కోరిక ( స్కెచ్ )
రచన:
కాలనాధభట్ట
వీరభద్రశాస్త్రి
 
చెట్ల చిఠారుకొమ్మన
లేచిగుళ్ళను తాకి ప్రసరించే
కమ్మ తెమ్మెర
ఎగిసిపడే సముద్రపు అలల తుంపర్ల స్పర్శ
నీలిఆకాశంలో దూదిబంతుల్లా తేలిపోయే
మబ్బుల గుంపులు
ఆ మబ్బులచాటున దోబూచులాడుతూ
తన కిరణాలతో
భూమాతను పులకిరింపచేసే భానుడు
రణగొణధ్వనిచేసే టెలెఫోన్ మోతవినబడని రోజు
ఒకచేతిలో చిక్కటి వెచ్చటి కాఫీ కప్పు
పక్కజేబులో వేయించిన పల్లీలు
వంటరిగా వూరిచివర నిలబడి
ప్రకౄతిలోని అందాన్ని తిలకించేందుకు
కాలవమీద ఒక సన్నని కాలిబాట వంతెన
ఇవన్నీ కుదిరినవేళ బహుశా
సంతోషంతో వూగిపోయే నా మనస్సులో
అద్భుతమైన  కవిత్వ భావ స్పందన
కలగవచ్చునేమో

అల్లసాని పెద్దనార్యా
నువ్వు అదౄష్టవంతుడవయ్యా!!

*************************************************************


 

సూక్తి ముక్తావళి (పద్య కవిత)
రచన: కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి

1. శ్రీ యటంచు మొదట వ్రాయుదురెందరో
గద్యరచనయందు పద్యమందు
కాని కవికి సిరులు కలుగుటే అరుదురా
శాస్త్రిమాట నేటి జగతిబాట

2. కవితవ్రాయువారు భువిని కోకొల్లలు
వ్రాయుచుందురెపుడు రాశి కొలది
రమ్యమైన కవిత రాశికన్నను మిన్న
శాస్త్రిమాట నేటి జగతిబాట

3. భాషవచ్చినంత పండితుడేగాడు
మాట ఇచ్చినంత మంత్రి గాదు 
ముష్టిఎత్తువాడు ముక్కంటిగాడురా
శాస్త్రిమాట నేటి జగతిబాట

4. అప్పు అడుగువేళ గొప్పగా పొగడును
అప్పు పుచ్చుకొనగ అతని మరచు
అప్పుతీర్చమన్న అధముడేయగునురా
శాస్త్రిమాట నేటి జగతిబాట

5. కట్నమీయమన్న కర్కశుడందురు
కట్నము వలదన్న కల్మషుండు
కష్టపడుచునైన కట్నమే యిచ్చురా
శాస్త్రిమాట నేటి జగతిబాట

6. ఉవిదమగనితోడ వుద్యోగమునుచేయు
యింటిపనులుచేయు వంట చేయు
నాడునేడుకూడ ఆడబ్రతుకిదియేర
శాస్త్రిమాట నేటి జగతిబాట

7. అన్నదానమీయ అట్టెకరిగిపోవు
ధనముదానమీయ తరగిపోవు
విద్యదానమొకటె వికసించు నెప్పుడు
శాస్త్రిమాట నేటి జగతిబాట

8. కాలు బయట పెట్ట కావలె నెప్పుడు
రాజకీయమందు రక్షణంబు
నిత్యశంకితంబు నేతల బ్రతుకురా
శాస్త్రిమాట నేటి జగతిబాట

9. కులము మతములనెడి కుత్సిత భావాలు
ఐకమత్యమునకు అడ్డుకావె?
మమతలేని మతము మనుజులకేలరా
శాస్త్రిమాట నేటి జగతిబాట

10. చవటవాని తెచ్చి సన్మాన మొనరింప
బుద్ధిశాలి యగునె మొద్దుగాక?
కాకి హంస యగునె కలరుకోటింగీయ
శాస్త్రిమాట నేటి జగతి బాట

11. ముసలివారలంచు విసవిస పడనేల
వృద్ధ వసతులందు వేయునేల?
ఆదరణకొరకు అర్రులుజాచరె?
శాస్త్రిమాట నేటి జగతిబాట

12. సెక్సు విద్యకూడ చెప్పవలయునంచు
వుబుసుపోక లేచె వుద్యమంబు
పాఠశాల అపుడు వ్యభిచారశాలరా
శాస్త్రిమాట నేటి జగతిబాట

13. ఓటుకొరకు వచ్చు ఒకసారి పదవిలో
ఓటువేయ ముఖము చాటుచేయు
ఓట్లు తనకు, మనకు పాట్లే మిగుల్చురా
శాస్త్రిమాట నేటి జగతిబాట
 
14. సిల్కులాల్చి, పంచె, సేవకు శిష్యులు
ఫష్టు ఏసి మరియు బెష్టు వసతి
సౌఖ్యమొందువారు స్వాములీనాడురా
శాస్త్రిమాట నేటి జగతిబాట

15. మూగజీవి యంచు ముంగిట కట్టిన
పశువు గడ్డిమేసి పాలనిచ్చు
పాలుత్రాగి మనిషి పశువునే చంపురా
శాస్త్రిమాట నేటి జగతిబాట

16. ఇంట బయటకూడ ఇంగ్లీషు మాట్లాడు
తెలుగు వచ్చికూడ తెగులు వలన
దేశభాషలందు తెలుగు లెస్సాయెరా (less)
శాస్త్రిమాట నేటి జగతి బాట
 
17. తెలుగు పలుకునింట అలవాటు గావింప
పిల్లలకది యబ్బు నెల్లవేళ
ఇంటిలోనకూడ ఇంగ్లీషుభాషేన?
శాస్త్రిమాట నేటి జగతి బాట

18. తేటనెనుగు నుడికి సాటిలేదిలలోన
ఎట్టిభాషలందు యెంచిచూడ
తెనుగు పదమునందు తేనెయే చిందురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

19. సీసపద్యమందు సింగారమొలికించు
తేటగీతియందు తేనెలొలులు
ఆటవెలది రాజహంసలానడుచురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

20. అంద మొప్పుచుండు కంద పద్యంబున
జాతివృత్తమటుల చాలగలవు
ఛందొబద్ధ కవిత సాహిత్య సామ్రాట్టు
శాస్త్రిమాట నేటి జగతి బాట

21. ఆంగ్లనవలనేడు ఆరాధ్యమయ్యెను
తెలుగునవల వ్రాయు తెరవునందు
సరస గ్రంధ చోర సాహిత్యమహిమరా
శాస్త్రిమాట నేటి జగతి బాట

22. దూరదేసమేగి దొరలాగ బ్రతికినా
వేషభాషలందు బేధమున్న
మాతృభాషనెపుడు మరచిఫోరాదురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

23. తెలుగుభాషలోన కలవు ప్రక్రియలెన్నొ
ఎవరికిష్టమేదొ ఎంచుకొంద్రు
దానిపైన ఏల తగవు విమర్శనల్
శాస్త్రిమాట నేటి జగతి బాట

24.మీడియాలొ మహిళ యాడులో కనుపించు
అర్ధనగ్నదేహ హాసలీల
వనిత బ్రతుకు తుదకు వ్యాపార మాయెరా
శాస్త్రిమాట నేటి జగతి బాట

25. మొదటిచూపులోన మోహమేజనియించు
ప్రేమ యంచు పెద్ద పేరుపెట్టు
పెళ్ళియాడి పిదప విడిపోవజూచురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

26. పెళ్ళిగాకముందు పెరవారిరువురూను
తాళికట్టగానె దగ్గరైరి
మమత పెంచుకొంచు మసలగా వలయురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

27. పూలు కుంకుమయు పొలతికి సహజంబు
పెళ్ళిగాకముందె పెట్టుకొనదె?
పతిగతించ వాటి వర్జింపనేలరా
శాస్త్రిమాట నేటి జగతి బాట

28. నూరబద్ధములతొ నొక జంటకలుపగా
సాయపడుట యెంతొ న్యాయమగును
కాపురములుగూల్చు కల్లలాడ తగునె
శాస్త్రిమాట నేటి జగతి బాట

29. ఆలితోడ సినిమహాలుకు వెళ్ళును
పక్కనున్న పడతివంకజూచు
భార్యనటుల జూచువారిపై అరచురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

30. సంతుకలుగ కలుగు సంబరమును మించి
మనుమలుద్భవించ యినుముడించు
అసలుకన్న వడ్డి సిసలైన ముద్దురా
శాస్త్రిమాట నేటి జగతి బాట

31. శ్రీగణేశుపూజ చేతురు ముందుగా
విఘ్నమేమిలేక విజయమొంద
మంచిపనులనెపుడు మన్నించు గణపతి
శాస్త్రిమాట నేటిజగతి బాట

32. నెలకు జీతమెపుడు నిశ్చయముగ వచ్చు
శ్రధ్ధపట్టి పనులు చేయనేల
అనుచు బద్ధకించ అది ద్రోహమేకద
శాస్త్రిమాట నేటిజగతి బాట
 
33. రైలుకన్న మరియు రాకెట్టుకన్నను
గాలికన్న పోవు నీలివార్త
దానివేగ మెంచ తరముకాదెవరికి
శాస్త్రిమాట నేటిజగతి బాట

34. కుంటివారుగాని గుడ్డివారుగాని
అంగలోపమంచు బెంగ ఏల?
అభ్యసించ పనులు అలవాటె యగునురా
శాస్త్రిమాట నేటిజగతి బాట

35. చిమ్మచీకటొక్క చిరుదీపకాంతిలో
మాయమగును అట్లె మంచిసూక్తి
మాపుమనసులోని మాలిన్య భావాలు
శాస్త్రిమాట నేటిజగతి బాట

36. చదువుకున్నవాడు సర్వఙ్ఞుడేయగు
చదువు కొనిన గాని చదువురాద?
విద్యనమ్ముకొన్న విలువేమి యుండురా
శాస్త్రిమాట నేటిజగతి బాట

37. గద్దెకొరకు యెట్టిఘాతుకమైనను
సలుపటదియె నెపుడు సహజమయ్యె
రాజకీయమందు రౌడిజం హెచ్చురా
శాస్త్రిమాట నేటిజగతి బాట

38. సభలలోన మంత్రి సర్వదా ప్రజలకు
సేవకుడనటంచు చెప్పుచుండు
తనను కలవబోవ దర్శనమీయడు
శాస్త్రిమాట నేటిజగతి బాట

39. పిసినిగొట్టువాడు పేరాశగలవాడు
అనుభవించకుండ ఆస్థిదాచ
తనయనంతరమది దాయాదిపాల్గాదె
శాస్త్రిమాట నేటిజగతి బాట

40. రాజసింహమౌర రాచరికమునందు
వీరసింహమౌర పోరునందు
గ్రామసింహ మింట గళమెత్తలేడురా
శాస్త్రిమాట నేటిజగతి బాట
 
41. నిత్యజీవితమున నెలకొనె భీతియు
ఇల్లు వదలి బయటకేగువాడు
తిరిగి ఇల్లు చేరు తెరవె సంశయమురా
శాస్త్రిమాట నేటిజగతి బాట

42. పాదచారి కాలిబాటపై నడవడు
వాహనములు పోవు బాటవెంట
పరగ రోడ్డురూల్సు పాటించు వారేరి
శాస్త్రిమాట నేటిజగతి బాట

43. మావటీడు చెంత మత్తగజంబైన
అణగి మణగియుండు అంకుశముకు
తెలివిముందు కండబలమెట్లు నిల్చురా
శాస్త్రిమాట నేటిజగతి బాట

44. బిచ్చగానివోలె వేషంబు వేయును
నటనలోనకీర్తి నందుకొనును
ముష్టివాని జూచి ముఖము చిట్లించురా
శాస్త్రిమాట నేటిజగతి బాట

45. మనిషి జన్మ ఎంతొ మహనీయమైనది
మంచి గుణముతోడ మసలవలెను
దైవదత్త మిదియె ధన్యతనొందరా
శాస్త్రిమాట నేటి జగతి బాట
(సశేషం)

********************************************************

 

నవ వసంతం

రచన: సతీష్ కుమార్ TVS

నవ వసంతపు ఉదయ వేళలొ
చిన్నారి గాలుల విందులే
కవికి కవితావేశం కలిగే
చిలిపి సవ్వడి చిందులే

మధురమే మధురమే మధు వసంత రాగమే
మధురమే మధురమే ఈ క్షణాల చలనమే

ఉదయ కాంతులు
నవ కళల కాంతులు     ||నవ||

***

కనులలొ కలలలొ
కీరవాణి రాగాలే

తనువులొ తపనలొ
అమౄతవర్షిణి రాగాలే

వినిన నా మనసులొ కనని ఏదో భావమే

మధురమే మధురమే మన విహంగ మార్గమే
మధురమే మధురమే ఈ క్షణాల చలనమే

ఉదయ కాంతులు
నవ కళల కాంతులు        ||నవ||

************************************

 

bhusundari_1.jpg

గ్రీష్మ పుష్పవిలాసం
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
 
ఇంకా రోహిణి రానేలేదు
కర్తరిలోనే మార్తాండుడు
చండ ప్రచండంగా
ధరాతలాన్ని ఎండకడుతున్నాడు

మరి వరుణదేముడు కరుణించాడో
సాగరజలం వేడెక్కి ఆవిరయిందో
గుంపులుగుంపులుగా కదలివస్తున్న
మొయిలుభామల్ని అలవోకగా
మలయమారుతం స్ఫౄజించిందో
శివతాండవానికి గంగ వలికిందో

జల జల చినుకులు రాలాయి
కుండపోతగా వానలు కురిసాయి
బీడువారిన నేలను తడిపాయి
ప్రాణికోటికి తాపం తగ్గించాయి

పుడమి తల్లి వడిలో
ఇంకిన జలరాశికి
ఒక్కసారి నిద్రలేచి ఆవులించి
గ్రీష్మం వికసించిందా అన్నట్టు
భూసుందరి జంటగ వెలికొచ్చింది
అహా! ఏమా వయ్యారం? ఏమా పుష్పవిలాసం!!

**********************************

శ్రీభద్రాచల సీతారామస్వామి సుప్రభాతం

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

1. శ్రీకరంబగు దివ్యాంధ్ర సీమలోన
తెల్లవారెను చీకటి తెరలుతొలగె
సకలజీవులు మేల్కాంచె సన్నుతింప
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

2. బ్రహ్మ, యీశ్వర యింద్ర దిక్పతులు వచ్చి
ఆలయంబున నీకు సేవలు చేయ
వేచియుండిరి కనుమయ్య వేడ్కమీర
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

3. తల్లి సీతమ్మ మాయమ్మ ధరణి పుత్రి
స్వామి హృదివాసి సౌభాగ్య సర్వలక్ష్మి
వాణి, పార్వతి యింద్రాణి వచ్చిరమ్మ
భద్రగిరివాస శ్రీరామ పత్ని లెమ్ము

4. నింగితిరుగాడు గ్రహములు నెమ్మితోడ
ద్వారమందున నిల్చిరి దర్శనముకు
నీపదములు పూజింపగా నెంచినారు
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

5. సప్తమునివరేణ్యులు నీకు స్వస్తిపలుక
గురుడు తిథియును, నక్షత్ర వారములను
తెలుపపంచాంగము పఠింప నిలిచినారు
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

6. భానుడుదయాద్రినుదయింప భాసురముగ
తనకిరణములు ప్రసరించి ధరణిలోన
వెలుగు విరజిమ్ముచుండెను వింతగాను
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

7. హనుమ, సుగ్రీవ, జాంబవంతంగదాది
వానరప్రముఖులు నీదుపాదయుగము
భక్తితోడను సేవించ వచ్చినారు
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

8. దేవ సాకేతపురనాధ! దివ్యరూప!
ధర్మముద్ధరించెడి అవతారమూర్తి
శిష్టరక్షకా!  దనుజవిచ్ఛేదకార
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

9. నిన్ను వర్ణించ కీర్తనల్ ఎన్నగాను
భక్తిరసమయ భావంబు భాసిలంగ
రామదాసు త్యాగయ్యలు వ్రాసినారు
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

10. అడవిని శిలయై యున్న అహల్య నీదు
పదము సోకగా నెలత రూపంబునొందె
అట్టి నీపాదయుగముల నంటనిమ్ము
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

11. కడలిదాటగా వారధి కట్టువేళ
చిన్న వుడత సాయంబును చేసెనంచు
నెమ్మితో దానివీపును నిమిరినావు
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

12. మొదట శ్రీరామ వ్రాయుటనాదిగాను
తెలుగువాడల అలవాటు కలిగెనయ్య
వ్రాసినది శుభప్రదముగా వాసికెక్కు
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

13. శక్తివంతుడవగు నీకు సాయమేల?
వానరులుకూడ నిను కొల్చు భాగ్యమటుల
కలుగచేసితివది నీదు కరుణగాదె?
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

14. నీహృదియె స్థావరంబుగా నిత్యముండు
సీతనెడబాసెనని వెత జెందినావు
ఏమినీమాయ తెలియగా ఎవరితరము?
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

15. అవని శ్రీరఘురాముడై అవతరించి
పూర్ణమానవమూర్తిగా స్పూర్తినొంది
సుఖముదు:ఖాది గుణముల సోలినావు
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

16. తేనెకన్నను మిన్నయౌ తీపిదనము
యుండె నీనామమందున నిండుగాను
రామనామము స్మరియింతు రమ్య మలర
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

17. పాడిపంటలువృద్ధిగా బరగుచుండ
పల్లెసీమల సౌందర్యపటిమగనగ
ప్రకృతిలో అణువణువును పరవశించె
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

18. లేత గడ్డిపై మంచుకురియ, అదియును
సూర్యకాంతిలో తళుకుల సొంపులీన
కరగిపోకుండ అద్దాని గాంచవయ్య
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

19. తల్లిదరిచేరి పాలను త్రాగగాను
లేగదూడలు ఆత్రాన సాగిరాగ
గోవు తమకాన కనుమోడ్చి కూర్మి నెరపె
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

20. తెనుగునాటను గౌతమీతీరమందు
సాధ్విసీతమ్మ, లక్ష్మణస్వామితోడ
వెలసితివిగ భక్తులు నిన్ను వినుతిజేయ
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

21. అదిగొ పక్షులు గూళ్ళను వదలిపెట్టి
మేతవెతుకగాను సుదూరమేగునపుడు
కిలకిలారావముదముగా సలుపుచుండె
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

22. నవ్యపోకడల జనత నడుచుగాక!
నాస్తికత్వ వాదనకిక స్వస్తి పలుక
విశ్వమంత నీవేయను విధము జూప
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

23. ఆర్ష సంస్క్రత నిలయమీ ఆంధ్రభూమి
పాడిపంటలతో నిండు పసిడినేల
అట్టిరాష్ట్ర రక్షక! పూజలందుకొనగ
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

24. కాలనాధభట్ట బిరుదు కలిగియున్న
పావనంబగు వంశాన బరగినాడ
వ్రాసితిని సుప్రభాతంబు భక్తితోడ
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

25. సుప్రభాతము పాడగా విప్రవరులు
ఆలయార్చక బృందములరగుదెంచి
వేచియున్నారు ! గీతము వినగదేవ
భద్రగిరివాస శ్రీరామచంద్ర లెమ్ము

మంగళహారతి

అవని ఆదర్శ దంపతులెవరనంగ
అరయగాను సీతారాములనుచు జనులు
వేయినోళ్ళను వినుతింత్రు వేడ్కమీర
ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

తనకుమార్తెనిచ్చెడివేళ జనకరాజు
కనకపుంపళ్ళెరంబున కడిగినట్టి
గంగప్రవహించు పదములు గాంచనిమ్ము
ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

తనివితీరదు నిన్ను స్తోత్రంబుచేయ
ఆలయంబున వెలసిన ఆర్యపుత్ర
మంగళంబగు నిత్యంబు మధురహాస
ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

ధరణి మత్స్య కూర్మ వరాహ నారసింహ
వామన పరశురామ శ్రీరామ కృష్ణ
బుద్ధ కల్క్యావతారముల్ పొందినట్టి
ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ


శాంతి సుఖము కలుగుగాక జనులకెపుడు
విశ్వమానవ శ్రేయస్సు వెలయుగాక
చిత్తశుద్ధి ప్రేమాంజలి చేతుమయ్య
ఆశ్రితవరద శ్రీరామ హారతిదిగొ

స్వస్తి

స్వస్తి!  జగతి నెల్లెడల ప్రశాంతి వెలయ
స్వస్తి! ఆలయనిర్వాహకాస్థికులకు
స్వస్తి! మనసార నినుగొల్చు భక్తతతికి
భద్రగిరివాస! శ్రీరామచంద్ర ! స్వస్తి!!

 

ఓం శాంతిశ్శాంతిశ్శాంతి:
***********************

 

ఇంకా చీకట్లో వున్నట్లే!! 
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి
 
చీకటిపోయి వెలుతురు వచ్చిందని
ఎల్లా చెప్ప్గలరు మీరు
అని గురువు శిష్యులను అడిగారు
దీపం అక్కరలేకుండా
బయట ప్రపంచాన్ని చూడగలిగితే
వెలుతురు వచ్చినట్లే అన్నాడో శిష్యుడు
కాదని  తల అడ్డంగా తిప్పారు గురువు
ఆ! దోమనైనా స్పష్టంగా చూడగలిగితే
వెలుతురు వచ్చినట్లేగా  అన్నాడు మరో శిష్యుడు
ఉహు! కాదని మళ్ళి తల అడ్డంగా తిప్పారు గురువు
అయోమయంగా చూసారు శిష్యులు
మరైతే మీరే చెప్పండి అని ప్రాధేయపడ్డారు
ఎప్పుడైతే పక్కవాని ముఖం చూసి
అతనిని నీ సోదరునిగా గుర్తిస్తావో
అప్పుడే చీకటి పోయి వెలుతురు వచ్చినట్టు
అల్లాంటి సౌబ్రాతృత్వ భావం నీలో కలగనప్పుడు
నువ్వు ఇంకా చీకట్లో వున్నట్లే!! 

 

**********************************


అహం భవాస్మి

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

 

క్షీరసాగర మధనం జరిగేటప్పుడు

ముందుగా హాలాహలం వుద్భవించింది

రాక్షసులతోసహా అందరూ హాహాకారాలు చేసారు

బోళాశంకరుణ్ణి ప్రార్దించారు

సారీ! స్తుతించారు

ఉబ్బులింగడు పొంగిపోయి నేనున్నానంటూ వచ్చి

హాలాహలాన్ని గుటుక్కున త్రాగాడు

అప్పుడు తెలిసింది కాబోలు రుచి

మింగలేక కక్కలేక

గొంతుదగ్గర నొక్కిపెట్టాడు

దాంతో గరళకంఠుడయ్యాడు

భావితరాలకు మార్గదర్శకుడయ్యాడు

ఈనాడు ప్రతివాడు పరమశివుడే

సాంబశివుడు ఆ నాడు ఒక్కసారి మాత్రమే విషం మింగాడు

నేడు మానవుడు

అనునిత్యం జరిగే దురంతాల పరిణామాల

హాలాహలాన్ని నిరంతరం గ్రోలుతూ

మింగలేక కక్కలేక

నిస్సహాయంగా చూస్తూ అనుభవిస్తూ

అపర గరళ కంఠుడవుతున్నాడు

అందుకనే కాబోలు అనుకొంటున్నాడు

అహం భవాస్మి

******************************

నేను తెలుగు వాడను

కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

ఉత్పలమాల:
తేటతెనుంగుమాట అది
             తీపిదనాన వరాలమూట, క
ర్ణాటక ఆంధ్రరాజ పరి
             రక్షితశోభిత ఫ్రౌఢమూర్తియై
నాటికినేటికిన్ వసుధ
             నాణ్యతగాంచెను కీర్తినొందె, యి
ప్పాటున పల్కెదన్ తెలుగు
             వాడను నేనని దర్పమొప్పగన్ 


********************************************

కుసుమాభ్యర్ధన


రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

నేనొక పూలమొక్కకడ నిల్చితి పూలనుకోయునంతలో
మానసమందు తోచెగద మమ్ముల నివ్విధి బాధపెట్టగా
మానుమటంచు పూలు బ్రతిమాలుచు చూచువిధంబుగా
ఏనిక మిమ్ములకోయనని యింటికి బోవగనెంచునంతలో

నన్ను ఎవరొ పట్టినట్టవ ఒకపరి  
తిరిగి చూచినాను తెల్లబోయి
వక గులాబి కొమ్మ వంగి తగిలి తాను 
పలికె నన్నుజూచి బాధతోడ

చూడుమీ వనమంత సోయగమొలికించు
ప్రకృతిసౌందర్యమింపార నెరపె
మల్లెలు జాజులు మందార చామంతి
విరివిగా వికసించి పరిమళించె
పూవులన్నియు నొక్క పూసలదండగా
పరికింప కన్నుల పండుగయ్యె
ఇది మధుమాసమా ఏమని భ్రమకల్గ
చేసెడి రీతిగా సీమ వెలసె

కాని నేల రాలుకద మరుదినమందు
జన్మ వృధ మరియు విషాధభరిత
మగును కాద! అట్టి మమ్ముల వీడుట
న్యాయమగున మాకు సాయపడక?

పుట్టిన ప్రాణి గిట్టుటయు పుట్టుటయున్ సహజంబు, పుట్టినన్
వట్టినె రాలిపోవుటది పాడియ? ఏమిఫలంబది? తోచెనొక్కటిన్
గుట్టుగ తాప్రమోదమొనగూర్చిన, మెచ్చిన చాలు తృప్తియౌ
పుట్టుక సార్ధకం బగును పుష్పమలంకృతమంచెరుంగవే? 

మాగతికానకుండ అటు మళ్ళెదవేల దయానిధీ? త్వదీ
యాగమనంబుచూచితిమి హర్షిత భావ పులంకితంబుగన్   
స్వాగతమయ్యనీకు! మనసారగ తోచిన పూవులన్నియున్
వేగమె సజ్జనిండుగను పేర్మిని నింపుము వెంటగైకొనన్
త్యాగముకాదు నిక్కువము దైవ పదంబుల చేరుభాగ్యమున్
యీగతి దక్కనిమ్ము తడవెందుకు? సందియమేల రమ్మికన్

పొలతుల సిగలోన పూలచెండ్లుగ మమ్ము
ముడిచిన మాకదిమోదమవదె?
గొబ్బెమ్మపై మము కూర్చగ కన్నియల్
పాడుచు తిరిగిన భాగ్యమదియె
పెండ్లిలో దంపతుల్ పేర్మి తలంబ్రాల్గ
పోసుకొనుట మాకు పుణ్యమవదె
పూలమాలగకట్టి పురుషోత్తముని మెడ
చేరగా మాకింక చింతగలదె?

ఇట్టివిధముగా సేవల నింపుమీర
సల్పు భాగ్యము దక్కదె సన్నుతింప
మమ్ము గొనిపొమ్ము దయచూపుమయ్య నీవు
ఇటనెవున్న ప్రయోజనమేమి మాకు?

(పూవులను కోయకుండా చెట్టునేవుంచేస్తే అవి రాలిపోతాయి కనుక,  కోయండి, వుపయోగించండి అని పూవులు అభ్యర్ధిస్తున్న భావం)
 

**************************

పాప!
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

ఏమిటి వెతుకుతున్నారు?
ముత్యాలకోసం
పాప నవ్వింది

ఈ వేళ చందమామ రాడు
అవును అమావాశ్యకదా!
అదేంకాదు! పాపమొహంచూసి కుళ్ళు

నాలుగేళ్ళనూంచి చూస్తున్నా ఈ రుమ్మాలు వుతికించరా?
వద్దు వద్దు మనం వస్తోంటే పాప ఏడ్చింది
దాని కన్నీళ్ళు తుడిచా

ఇదిగో ఫోన్ రింగవుతోంది చూడు
పాప ఫోన్ చేసిందండీ
పాప పుట్టిందిట

ఏమిటి తాత గారూ దీక్షగా చుస్తున్నారు?
పాపా! నీకూతురుది నవ్వుతూవుంటే
నీపోలికే
అబ్బో ఎన్ని ముత్యాలో !!   

**********************************

 

ఒక్కసారి బ్రతికించు
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

పాపాలు పాపాలు
ఘోరమైన నేరాలు
అందుకు నరకంలో శిక్షలు
శులాల్తొ పొడుస్తారు
సలసలకాగే నూనెలో వేస్తారు
ఱంపాలతో కోస్తారు  
చిత్రహింసలు పెడ్తారు
ఏం వింటేనే భయంగావుందా
అందుకే దేవుడి హుండీలో
లక్షలూ కోట్లూ పోస్తున్నావా
స్వాములు బాబాల చుట్టూ తిరుగుతున్నావా?
నీకీసత్యం తెలియదేమో
నరకంలో పెట్టే శిక్షలు
కాలిబూడిదైన నీదేహానికేమో
నీ ఆత్మకు కాదేమో
నీ ఆత్మ నాశనరహితమైనది
గీతలో రెండో అధ్యాయం చదవలేదా??

నైనం చిందన్తి శస్త్రాణి
నైనం దహతి పావక:
నచైనం క్లేదయన్త్యాపో
నశోషయతి మారుత:

పుణ్యాలు చేస్తే హాయిగా
పొందవచ్చు స్వర్గ సౌఖ్యాలు
మగచచ్చినాళ్ళయితే
రంభాది అప్సర సంయోగాలు

ఏమి  పిచ్చి ఆలోచలు
ఏమి మూఢ విశ్వాసాలు
నువ్వు చేసే పాపపుణ్యాల ఫలితం
నువు బ్రతికివుండగానే అనుభవిస్తావేమో
కొంచెం  నిదానంగా ఆలోచించు
భవితలో కలిగే పరిణామాలను వూహించు
వుహూ! నీకు నమ్మకం లేదు
నమ్మకం రాదు
భయాంధోళనా సమ్మిళతమైనభక్తితో
నీపాపాలను ప్రక్షాళన చేసుకోవాలనుకుంటున్నావా?

ఓ అనంత విశ్వ సృష్టి కర్తా
మానవాతీత అఖండ శక్తి దాయకా
నేను చచ్చిపోయాక
నా కట్టె కాల్చేలోపుగా
ఒక్కసారి బ్రతికించు
చచ్చాక అంతా శూన్యమేనని
ఇది నాస్వానుభవమని
ఈ నరకం స్వర్గం లేవని
అబూతకల్పనలేనని
పాపపుణ్యాల ఫలితాలు
ఇక్కడే అనుభవిస్తామని
ఈ సత్యాన్ని ఉద్ఘాటించి
మళ్ళీ చచ్చిపోతా

***********************


 

సమాజమా? అదెక్కడవుంది?
రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

అది ఒక సంధ్యా సమయం
జంటలుగా విహారానికి వచ్చే పార్కులో
ఒక చోట పచ్చగడ్డిపైన
నిమీళితనేత్రాలతో వెల్లకితలా పడుకున్న కవి

స్వామీ ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?
కళ్ళుతెరిచిన కవి చిరునవ్వు నవ్వాడు

కమ్మ తెమ్మర స్పర్సతో కల్గుచుండె
మధురభావాలు హేలగా మనసునందు
వచన కవితలో జొప్పించి  వ్రాయ నెంచి
వూహలందును విహరించ బోయినాను

ఆహా ప్రకృతి ఎంత సుందరంగా వుంది
గ్రీష్మ భాను తాపనివారణకా అన్నట్టు
నీలి గగనాన గుంపులు కూడిన మేఘాలు
ఆ మేఘాల చాటున భువిని
ముద్దాడబోతున్న తుషార బిందువులు
వాటికాహ్వానం పలికే నెమళ్ళ నర్తనలు
మలయమారుత స్పర్సతో పులకించి
టప టప రాలే వానచినుకులలో
తపతపమని  గంతులువేసే పిల్లలు
పచ్చని చెట్ల ఆకులచివర్లనుంచి
జాలువారుతున్న వాన చినుకులను
గవాక్ష వీక్షణలతో మురిసే ముగ్ధ కన్నియలు
ఆ చల్లని వాతావరణంలో
నాప్రియురాలి పరిష్వంగసుఖానుభూతిని వర్ణిస్తా
నేను భావుకుణ్ణి. సొందర్యోపాసకుణ్ణి
ఈ ప్రకృతిలోని అణువణువూ పులకింతలిచ్చే
మనోహర దృశ్యాలని నా కవితలొ జొప్పిస్తా!!


అయితే స్వామీ! సమాజం గురించి ఏమీ వ్రాయారా?

సమాజామా? అదెక్కడ వుంది ??

**********************************

 

Enter supporting content here