TeluguBrains

Telugu Dramas

Home
Teams Information
In Media
Telugu Software
OPMS
Poetry from Members
Stories from Members
Dramas from Members
Telugu Excel Templates
Moral Stories
Translated Stories
Mail to Govt Departments
Important Links

ఆపోహలు వద్దు

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి

 
 
(అన్నీ స్త్రీ పాత్రలతోకూడిన నాటకం)

ఇందు వచ్చు పాత్రలు: వర్ధనమ్మ (40), కృష్ణవేణి (55), కామాక్షి (62),  సత్యవతి (55), రాజ్యలక్ష్మి (45)

 
మొదటి రంగం

కృష్ణవేణి: వర్ధనమ్మగారూ! వర్ధనమ్మగారూ!

వర్ధనమ్మ: (లోపలనుంచి) ఎవరువారు?


కృ: నేనండి కృష్ణవేణిని
వ: (తలుపు తీస్తూ) ఓ మీరా రండి వదినగారూ! రాజమండ్రీనుంచి ఎప్పుడు వచ్చారు?
కృ: ఉదయమే వచ్చానండి
వ: పెళ్ళి బాగా జరిగిందా?
కృ: డబ్బు బాగా వున్నవాళ్ళుగదా! బ్రహ్మాండంగా జరిగింది. ఇటు పది లక్షలుకట్నం అటు ఐదులక్షలు నగలు, ఇక విందులు వినోదాలు, వేడుకలు అబ్బో!! అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. మన సరళకు సంబంధం చూసా!
వ: ఏమిటి! మాసరళకే?? ఏవూరు? ఎవరి అబ్బాయి?
కృ: వాళ్ళదీ రాజమండృఏ. మగపెళ్ళివారికి దగ్గరచుట్టాలు. పిల్లాడు చాలా అందంగా వుంటాడు. పాతికేళ్ళుంటాయి. ఎం బి ఎ చదివి అమెరికా వెళి బిజినెస్ మేనేజి మెంటులో ట్రైనింగై ఇప్పుడు తండ్రితో బాటు బిజినెస్సుచేస్తున్నాడు. ఈ అబ్బాయి తర్వాత ఓ ఆడపిల్ల. నిరుడే పేళ్ళి అయింది.
వ: అబ్బో పెద్దింటి సంబంధమే! కట్నం చాలా ఇవ్వాలేమో??
కృ: అదేనమ్మా ఇదమిద్ధంగా తెలియలేదు. నేను వినడం వాళ్ళు కట్నాలేమీ ఆశించడం లేదుట. పిలబుద్ధిమంతురాలై, కనుముక్కూ తీరూ బాగుంటే చాలుట. అధమం ఇంటరువరకైనా చదువుతే చాలుట.
వ: అదేమిటి? ఆస్థిపరులంటున్నావు, కుర్రాడేమో అమెరికాకూడా వెళ్ళివచ్చాడంటున్నావు. కట్నం లేకుండా పెళ్ళి చేసుకొంటారా?? నమ్మ బుద్ధి కావడం లేదు.
కృ: నాకూ అదే అనుమానం వచ్చిందనుకో! అయితే వివరాలెవరూచెప్పలేదు. వాళ్ళనే అడుగుదామనుకొన్నాగాని, మీతో చెప్పకుండా కదపడం ఎందుకని వూర్కున్నా. ఆ మర్చిపోయా! ఈవూళ్ళోనే ఆ కుర్రాడి మేనత్త వుందట. అడ్రసు తీసుకొచ్చా.. పోనీ అన్నయ్యగార్ని పంపి మాట్లాడమనరాదూ??
వ: మీ అన్నగార్నా!! సర్లెండి. ఆయన నోట్లో నాలుకలేదు. గట్టిగా ఏవిషయం కనుక్కోలేరు. అసలు ఇల్లాంటి వ్యవహారాలు ఆయన వల్ల కావు. మీరే పూనుకోవాలి వదినగారూ! మీమాటకారితనం చొరవ ఎవరకీ లేవు
కృ: సర్లెండి. ఈవిధంగానైనా మన సరళకి త్వరలో పెళ్ళయితే అంతకన్నా ఏంకావాలి!
వ: నిజమే వదినగారూ! దానికి ఇరవై నిండాయి. ఈ ఏటితో బి.కాం పూర్తీవుతుంది.  ఇక పెళ్ళి చేసి ఓఅయ్యచేతిలో పెట్టాలని అనుకుంటున్నాం
కృ: దిగులెందుకు లెండి వదినగారు. ఎల్లాగో ఒకలాగు ఈ సంబధం ఖాయం అయేటట్టు చూస్తా
వ: మీకు శ్రమ యిస్తున్నాం వదినగారూ
కృ: ఇందులో శ్రమేంవుంది. మరినేను వస్తా!
వ: వుండండి కాఫీ త్రాగి వెళ్దురుగాని
కృ: వద్దు వద్దు! ఈ మధ్య కాఫీ రోజుకు ఒక్కసారే తాగుతున్నా. ఎక్కువసార్లు కాఫీ తాగడం మంచిదికాదని మా అమెరికా కోడలు మరీ మరీ చెప్పింది.
వ: పోనీ కమ్మని మజ్జిగ ఇస్తా వుండండి. అయితే మీకోడలు ఇంకా డైటింగ్ చేస్తోందా?
కృ: అహా! మనం తినే అన్నం దుంపకూరల్లో అదేదో ఎక్కువ వుండి వాటివల్ల షుగరు వ్యాధి వస్తుందీట. మాయింట్లో అందరకీ ఏమేమి ఎల్లా వండిపెట్టాలో ఒక కాగితం మీద రాసి యిచ్చింది.  నిజం చెప్పొద్దూ! నాకు పూర్వం వున్న కీళ్ళనొప్పులు, ఆయాసం బాగా తగ్గాయి
వ: అదీ మంచిదేలెండి. ఆరోగ్యం బాగుండడం కన్నానా .. రండి లోపలకి వెళ్దాము. కాస్త మజ్జిగ తాగి వెళ్దురుగాని (ఇద్దరూ లోపలకి వెళ్తారు)

రెండవరంగం

కామాక్షి: వర్ధనమ్మా! వర్ధనమ్మా!
వర్ధనమ్మ: (ప్రవేశిస్తూ) రండి కామాక్షి పిన్నిగారూ! ఎప్పుడు వచ్చారు వూరునుంచి?
కా: పొద్దున్నే వచ్చాను. అవునూ మన సరళకి నిన్న పెళ్ళి చూపులు అయ్యాయటకదూ?
వ: మరేనండి. మిమ్మల్ని పిలుద్దామని మీయింటికి వచ్చా. మీరు వూళ్ళో లేరని మీకోడలు చెప్పింది. మీ అబ్బాయి, కోడలు కూడా వచ్చారు.
కా: మరేనమ్మా కోడలు చెప్పితే సంగతి కనుక్కుందామని వచ్చా. పిల్లాడు చక్కగా వున్నాడుటగా! బాగా వున్నవారుట.
వ: అవునండి. అబ్బాయి అమెరికాలో ట్రైనింగ్ అయి వచ్చి రాజమండ్రీలో తండ్రితో బాటు బిజినెస్సు చేస్తున్నాడుట. మన సరళకు ఈడూ జోడూ సరిపోతాడు.  దేవుని దయవల్ల ఈ సంబంధం కుదురినట్టేనండి.
కా: అయితే యింకా తాంబూలాలు పుచ్చుకోలేదా?
వ: లేదండి. వాళ్ళు యింటికి వెళ్ళి మంచిరోజు చూసి కబురుచేస్తామన్నారు.
కా: బాగుందమ్మా! చల్లని వార్త చెప్పావు. ఇంతకీ కట్నం ఏమాత్రం గుంజుతున్నారేమిటి?
వ: వాళ్ళు కట్నం అసలు పుచ్చుకోరుట. కృష్ణవేణమ్మ వదినగారితో అన్నారుట.
కా: ఏమిటీ యిది కృష్ణవేణి తెచ్చిన్ సంబంధమా? దానికెల్లా తెలుసు?
వ: ఆమధ్య రాజమండ్రీ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈ కుర్రాడిని చూసిందట. మన సరళకు యీడూజోడూ  అని వాళ్ళ వివరాలు వాకబు చేసుకొచ్చి మాతో చెప్పింది.  ఈవూళ్ళో కుర్రాడి మేనత్త వుంది. ఆవిడతో మాట్లాడి పెళ్ళి చూపులకు ఏర్పాటు చేసింది.
కా: మేనత్తా? ఈవూళ్ళోనా? ఎవరబ్బా??
వ: సత్యవతిగారని సింగునగర్లో వివేకానందస్కూలు ఎదురుగా వున్న కొత్త మేడలో వుంటున్నారు
కా: చూడు వర్ధనం .. ఈ డబ్బున్నవాళ్ళు  కట్నం వద్దు అన్నారంటే మనం కొంచెం ఆలోచించాలి. ఏదో అవకరం లేకపోతే యిల్లా కట్నం వద్దు అని అనరు. పైగా కుర్రాడు అమెరికా వెళ్ళి వచ్చాడంటున్నావు. అక్కడేం తింగరి వేషాలు వేసాడో!!  ఎల్లాగో ఒకలాగ తమ కొడుక్కి పెళ్ళి అవుతే చాలని ఇల్లాంటి ఎర పెడ్తారు. అందుచెత మీరు కొంచెం నిదానించి, వివరాలు సేకరించి మరీ ముందుకు వెళ్ళండి.
వ: (నసుగుతూ) కట్నం తీసుకోకపోవడం ఆదర్శం అనీ …
కా: చూడమ్మాయ్ ఆదర్శాలని చెప్పే ఈ  గొప్ప గొప్ప కబుర్లన్ని వున్న లోపాల్ని కప్పి పుచ్చుకోడానికి అనే మాయ మాటలు. నువ్వొక సత్తెకాలం మనిషివి. ప్రతీదీ తేలిగ్గా నమ్మేస్తావ్ ఆ కౄష్ణవేణి వఠి కంగారు గొడ్డు. ప్రతిదానికీ దూకుడే. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో విను. కాస్తముండూ వెనకా ఆలోచించు.
వ: మరి వాళ్ళు తాంబూలాలు పుచ్చుకోడానికి వస్తామని కబురుచేస్తేనో??
కా: ఏదో సాకు చెప్పి వాయిదా వెయ్యి. మన ఆడవాళ్ళకి వున్న సాకేగా! కంగారు పడక నిదానించు, మరి వస్తా (వెళ్ళిపోతుంది. వర్ధనమ్మ పరధ్యానంగా బుర్ర వూపుతుంది)
కృష్ణవేణి: (ప్రవేశిస్తుంది) ఏమిటి వదినగారూ! గుమ్మంలో నిలబడివున్నారు?
వ: కృష్ణవేణి వదినగారా! రండి రండి
కృ: శుభవార్త వదినగారూ! మగపెళ్ళివారు పిల్ల నచ్చిందని కబురు చేసారు. వచ్చే గురువువారం తాంబూలాలు పుచ్చుకోడానికి వస్తామని చెప్పమన్నారు.
వ: తాంబూలాలికే! అదేమిటి మరి మిగిలిన విషయాలు మాట్లాడుకోవద్దా?
కృ: మిగిలిన విషయాలేమున్నాయి? వాళ్ళు కట్నం పుచ్చుకోనన్నారుగా!
వ: నిజమే అనుకోండి. కాని…
కృ: అదేమిటి ఏదో సందేహిస్తున్నారు
వ: మరేంలేదుకాని, కట్నం వద్దన్నారంటే..నాకేమిటో అనుమానంగా వుంది
కృ: అనుమానమా? చెప్పాకదా వాళ్ళు వరకట్నం పుచ్చుకోకూడదనే నియమం వుందని
వ: అదే ఎందుకని? మరోలా అనుకోకండి కుర్రాడు మంచివాడేనా??
కృ: ఇదేమిటి? ఇంతవరకు లేని అనుమానం  ఇంతలోకే ఎల్లావచ్చింది?
వ: మీరు వచ్చేముందే కామాక్షి పిన్నిగారు వచ్చారు. కట్నం వద్దన్నారంటే కొంచెం ఆలోచించాలి.  అందుచేత నిదానించి మరీ తాంబూలాలు పుచ్చుకోమన్నారు. నాక్కూడా అదే మంచిదేమోనని అనిపిస్తోంది. ఒకసారి వాకబు చేసి మరీ ..
కృ: (తనలో) ఒహో! ఇది కామాక్షిగారి పనా!! (పైకి) సరే! వెళ్ళి కుర్రాడి మేనత్తతో సరళకు ఇబ్బంది రోజులు, పైవారం తాంబూలాలుకు ఏర్పాటు చేద్దామని చెప్తా. వస్తా (అని వెళ్ళిపోతుంది. వర్ధనమ్మ ఆలోచిస్తూ లోపలకి వెళ్తుంది)

మూడవ రంగం

కామాక్షి: సత్యవతిగారూ సత్యవతి గారూ!
సత్యవతి: ప్రవేశిస్తూ) ఎవరండి మీరు?
కా: సత్యవతి మీరేనా?
స: అవును నేనే. ఇంతకీ మీరెవరు?
కా: నాపేరు కామాక్షి. ఈవురే. పక్కవీధిలో పోష్టాఫిసు పక్క ఇల్లేమాది
స: అల్లాగా రండి. మిమల్ని ఎప్పుడూ చూడలేదు
కా: మా అబ్బాయి ఇక్కడ కోర్టులో పనిచేస్తునాడు.  వాడికో కూతురుంది. ఇంటర్మీడియెట్ చదువుతోంది. పిల్ల అందంగావుంటుంది. బుద్ధిమంతురాలు. పనిపాటా తెలుసు
స: ఈ వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నారు. నాకొడుక్కి పెళ్ళైంది.  ఓ కూతురు కూడాను
కా: ఆ సంగతి తెలుసండి. మీమేనల్లుడికి పెళ్ళి చేస్తారని విన్నాను
స: ఓహో వాడికా! అవును అనుకొన్నాం, అయితే వాడికి యీవూళ్ళోనే ఒక సంబంధం చూసాము. ఓ వారంరోజుల్లో తాంబూలాలు కూడా పుచ్చుకొంటాము.
కా: ఈ వూళ్ళోనా? ఎవరబ్బా!
స: మాధవరావుగారని రైల్వేలో ఇంజనీరు. వారి అమ్మాయి
కా: ఎవరు సరళా?
స: ఆ సరళే మీకు తెలుసా?
కా: బలేవారే! తెలియకపోవడమేమిటి?? అయినా వాళ్ళు మీఅంతస్థుకి తగ్గ కట్నం యిచ్చుకోలేరే? అయినా పిల్ల మా మనుమరాలికన్నా అందకత్తెకాదే!
స: కట్నం విషయం ఆ వివరాలు నాకు తెలియదు. అవన్నీ మా అన్నయ్య వదిన చూసుకొంటారు. తాంబూలాలు పుచ్చుకోవడం మట్టుకు ఖాయం
కా: అల్లాకాదు, మీరు చెప్తే మీ అన్నయ్యగారు వినకపోరు. మా అబ్బాయి మీరుకోరినంత కట్నం యిస్తాడు. మీరోముక్క వారి చెవిని వెయ్యండి చాలు
స: ఇందులో నేను చేయకలిగిందేమీలేదు
కా: సరే నేనే స్వయంగా రాజమండ్రీ వెళ్ళి అడుగుతా! (వెళ్తుంది. సత్యవతి ఆలోచిస్తూ లోపలకి వెళ్తుంది)

నాలుగవ రంగం

కృష్ణవేణి: వర్ధనమ్మ వదినగారూ!
వర్ధనమ్మ: రండి కౄష్ణవేణి వదినగారూ
కృ: నిన్న ఆ కుర్రాడి మేనత్త కబురు పెట్టింది
వ: ఏమిటి తాంబూలాలకేనా? కొంచెం ఆగుదామనుకొన్నాంగా!
కృ: మీ తాంబూలాలు బంగారుగానూ! ఇప్పుడు యింకో ఇరకాటం వచ్చింది
వ: ఏం ఏమైంది? మనం అనుమానించింది నిజమేనా?
కృ: మీరు యింకా అనుమానంలోనేవున్నారా! వాళ్ళకి అయిదు లక్షలు కట్నం, లాంచనాలు ఏభై వేలు కావాలిట. ఏసంగతీ రేపు వుదయానికల్లా చెప్తే తాంబూలాలు పుచ్చుకోడానికి వస్తారుట. వాళ్ళకి మరో సంబంధం వచ్చిందట ఇంత కట్నమూ లాంచనాలు ఇస్తామని. ఓ నెలరోజుల్లో కుర్రాడు మళ్ళీ అమెరికా వెళ్తాడుట. అక్కడే మరో ఆఫీసుపెట్టి బహుశా తనేవుండి చూసుకొంటాడుట.
వ: (కంగారుగా) అదేమిటి? వాళ్ళు కట్నం పుచ్చుకోరన్నారుగా?
కృ: నాతో ఆ మేనత్త కట్నం పుచ్చుకోరనే అంది.  మరి మళ్ళీ ఇల్లా కబురు చేసింది ఇప్పుడు
వ: అయిదు లక్షలు మేము ఎక్కడనుండి తేగలం
కృ: ఏభైవేలు లాంఛనాలు కూడా
వ: అయ్యబాబోయ్ ఇది చాలా దారుణం వదినగారూ! తాంబూలాలు పుచ్చుకోడానికి వస్తున్నామని కబురు పెట్టి, యిప్పుడీ పితలాటకం ఏమిటి??
కృ:  చూడండి వదినగారూ! వాళ్ళు మంచి ఆస్థిపరులు. కుర్రాడా అందగాడు, పెద్ద చదువులు అమెరికాలో చదివినవాడు. వాళ్ళు అడిగిన కట్నం నిజంగా ప్రస్తుత పరిస్తితులలో చూస్తే తక్కువే అనవచ్చు. సరే ఏంచేస్తాం!! మనకు ప్రాప్తం లేదు. మన సరళకి తగిన యీడూ జోడూ అని సంబరపడ్డా. పోనీ నావల్ల అది ఒక మంచి కుటుంబంలోకి వెళ్తుందని ఆశ పడ్డా. ఇంతకీ దానికి రాశి పెట్టిలేదు. సరే నేను వెళ్ళి చెప్పి వస్తా అంత కట్నం మనం యిచ్చుకోలేమని, వాళ్ళని యింకోసంబధం చూసుకోమని.
వ: (కన్నీళ్ళ పర్యంతం అయి ..డగ్గుత్తికతో) వదినగారూ! పిల్లాడికి పిల్ల నచ్చిందని అన్నారు. అల్లాంటప్పుడు మీరే కాస్త అనునయంగా మాట్లాడి ఆమాంబాపతు మొత్తం మూడు లక్షలదాకా యిస్తామని చెప్పి వప్పించండి. మీకు చాలా పుణ్యం వుంటుంది
కృ: ఏమో మరి అవతల ఇంకో సంబంధం రెడీగా వుందంటున్నారు
వ: అదికాదు వదినగారూ మీరు పూనుకొంటే కాకపోదు
కృ: అయినా ఆకుర్రాడిలో ఏదో లోపంవుందేమోనని సందేహంగా వున్నప్పుడు, పోనీ వద్క్షిలేస్తేపోలే??
వ: సందేహమా పాడా! కామాక్షమ్మ పిన్ని ఏదో చెప్పిందని గుడ్డిగా నమ్మేసా అసలు వాళ్ళు తాంబూలాలకి వస్తామన్నప్పుడు రమ్మని అంటే తీరిపోను. అప్పటకి వాళ్ళకి ఈ కొత్త సంబంధం రాలేదుకదా!
కృ: సరే నేను వెళ్ళి నాశాయశక్తులా ప్రయత్నిస్తా. మరి వదినగారూ తీరా వాళ్ళని వప్పించాక, మళ్ళీ  ఎవో వంకలు పెట్టి..
వ: వదినగారూ! బుద్ధివచ్చింది. ఇక అల్లాంటి సందేహాలేమీ పెట్టుకోను. మీరు ఎల్లాగో ఒకలాగ వాళ్ళని వప్పించండి. అవసరమైతే మరో పాతికవేలు లాంఛనాలకింద యిస్తామని చెప్పండి
కృ: ప్రయత్నిస్తా! నాకు ఖచ్చితంగా చెప్పండి ఈ సంబంధం మీకు నిజంగా ఇష్టమేనా? లేకపోతే వాకబు చేసాక అప్పుడు ఖాయం చేసుకొందామా వాళ్ళు ఈ లోగా మరో ప్రయత్నం చెయ్యకుండా వుంటే!
వ: ఇంకా వాకబు అది అంటూ మీనమేషాలు లెఖపేట్తూ కూచుంటే వాళ్ళు ఇంకో సంబంధం చూసుకోవచ్చు. ఇదిగో మళ్ళీ చెప్తున్నా నాకేవిధమైన సందేహాలు లేవు. అనవసరంగా కామాక్షమ్మ పిన్ని మాట విని ఈ తంటా తెచ్చుకొన్నా
కృ: సరే అంతగా చెప్తున్నారుగనుక వెళ్ళి మాట్లాడుతా.. ఏమో మరి వాళ్ళు వప్పుకొంటారోలేదో (అంటూ వెళ్ళిపోతుంది. వర్ధనమ్మ దిగాలుగా చూస్తూవుండగా తెర)

ఐదవ రంగం

కృష్ణవేణి: వదినగారూ!
వర్ధనమ్మ: ఆ వచ్చె. రండి కృష్ణవేణి వదినగారూ ఏమైంది కాయా పండా?
కృ: అదిగో అల్లా చూడండి మీకాబోయే వియ్యపురాలు, మేనత్తగారు వస్తున్నారు
వ: ఏమిటి మనింటికే??
కృ: ఆహా .. అదిగో వచ్చేసారు (సత్యవతి, రాజ్యలక్ష్మి ప్రవేశిస్తారు)
వ: (కంగారుగా) రండి రండి కూర్చోండి
సత్యవతి: ఏమండి ణ్గ్ణ్జాపకం వున్నానా సత్యవతిని
వ: అయ్యో ణ్గ్ణ్జాపకం లేకేం
స: మా రాజ్యలక్ష్మిని రమ్మన్నాను. ఈవేళే వచ్చింది
వ: చాలా సంతోషమండి
స: రాజ్యలక్ష్మీ నేను మాట్లాడనా నువ్వే చెప్తావా?
రాజ్యలక్ష్మి: చూడండి వర్ధనమ్మ వదినగారూ! కొన్ని కొన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకొని అపోహలు తొలిగించుకోవడం మంచిదని మా వదిన కబురుచేస్తే వచ్చా మీకో సంగతి చెప్పాలి. మా అబ్బాయికి కొన్ని ఆదర్శాలువున్నాయి. పెళ్ళిచూపులకంటూ వెళ్ళడం జీవితంలో ఒకేసారని, వెళ్ళడం అంటూ జరిగితే అది నిశ్చయం చేసుకోవడానికేనని వాడి అభిప్రాయం. ఆడపిల్లలు సంతలో సరుకులు గారు పెళ్ళిచూపులంటూ పదిమందిని చూసి ఏరుకోవడానికి అంటాడు. అందుకనే మీసంబంధం విషయం కౄష్ణవేణమ్మగారు చెప్పగానే అమ్మాయి ఫొటో చూసాడు. మిగిలిన వివరాలు విన్నాడు. నాకు నచ్చింది. మరి నేను నచ్చానా అని ఆ అమ్మాయిని అడిగారా అన్నాడు.ఎల్లాగూ పెళ్ళిచూపులకు వెళ్తాం కదా అక్కడే అమ్మాయి నిన్ను చూస్తుంది అని వాణ్ణి వప్పించి పెళ్ళిచూపులుకి తీసుకొచ్చాము. ఇహ కట్నం విషయం అంటారా వరకట్నం పుచ్చుకోమని కాలేజీలో ఒక సభలో స్నేహితులు వీడూ ప్రమాణం చేసారుట. 
వ: మంచి ఆదర్శమండి.
రా: నిజమే మంచి ఆదర్శమన్నమీరే కట్నం పుచ్చుకోకపోవడంఏదో అవకరం వుండడం వల్లనే అని సందేహించారుగదా!
వ: పొరపాటేనండి. అసలు నాకా అనుమానమే లేదు. అదిగో కామాక్షమ్మ పిన్నిగారు వచ్చి
స: కామాక్షిగారా! అంటే నల్లగా పొడుగ్గావుంటుంది  ముసలావిడ
వ: మీకు తెలుసా?
స: నాకు తెలియదనుకోండి. ఒకసారి మాయింటికి వచ్చి తనమనుమరాలని మామేనల్లుడి ఇద్దామని అడిగింది.
వ: ఆ నిజమా?
స: అంతేకాదు మాతాహతుకు తగ్గ కట్నం మీరు ఇచ్చుకోలేరని చెప్పింది
వ: ఔరా ఎంతనంగనాచో నాతో అల్లా అని
కృ: చూసారా వదినగారూ! తనమనుమరాలుకోసం ఈ నాటకం ఆడింది. మీరేమో గుడ్డిగా ఆవిడ మాటలు నమ్మేసారు.
వ: నాది పొరపాటే
రా: ఇప్పటికైనా మీ అనుమాశ్నం తీరిందా? లేకపోతే వాకబు చేసుకొంటారా? ఆగుతాం
వ: ఎంతమాట! ఇంకా అనుమానమా? మిమ్మల్ని అపార్ధం చేసుకున్నందుకు సిగ్గు పడుతున్నా
రా: ఇంతకీ మీ అమ్మాయికి యిష్టమేనా?
వ: అయ్యో ఇష్టంలేకపోవడేమిటండి. పెళ్ళిచూపులవగానే అడిగాం. ఇష్టమే అంది
కృ: ఇక ఆలస్యం ఎందుకు? త్వరగా తాంబూలాలు పుచ్చుకోడానికి ఏర్పాటు చెయ్యండి.
స: శుభస్య శీఘ్రం మరి మేము వెళ్ళి వస్తాం. ఎల్లుండే తాంబూలాలు
వ: చాలా సంతోషం. తప్పకుండా ఆ ఏర్పాట్లమీద వుంటాం

సమాప్తం
(తెర)