ఒక రాజు ఆస్థానంలో
వడ్రంగి వున్నాడు. అతను
మంచి నైపుణ్యం గల పనివాడు.
ఎన్నో భవంతులు కట్టి
రాజుగారి మెప్పు పొందాడు.
కొన్నాళ్ళకి ఇక పనిచెయ్యలేని
వయస్సు వచ్చాక, తనకు ఇక
పని చేసుకోగల శక్తి తగ్గిందని,
తను పనిలోంచి తప్పుకుంటానని
రాజుగార్నిఅడిగాడు. రాజు
ఒకసారి అతనికేసి చూసి,
సరే నీ యిష్టం. కాని నువ్వు
దిగిపోయేముందు. చివరగా
ఒక ఇల్లు కట్టి మరీ పని
మానివెయ్యి అని అన్నారు.వడ్రంగి
కాదనలేక తలవూపి చక్కా
వచ్చాడు. ఇప్పుడుకూడా
మంచినైపుణ్యంతో ఇల్లు
కట్తే, తనని పని మానవద్దని
రాజుగారు అంటారేమోనని,
నాసిరకం వస్తువులతో ఒక
మాదిరిగా వుండే ఇల్లు
ఒకటి కట్టి, రాజుగారికి
చెప్పాడు. వెంటనే రాజు
గారు ఇన్నాళ్ళూ నువ్వు
కష్టపడి మంచి మంచి భవనాలు
నిర్మించావు. అందుకు
ప్రతిఫలంగా ఈ ఇల్లునువ్వు
తీసుకో అన్నారు ఎంతో
వుదారంగా
వడ్రంగి నిశ్చేష్టుడయ్యాడు
నీతి ఏమిటో వేరే చెప్పక్కరలేదనుకొంటాను.
***************************************
ఒక ధనవంతునికి మంచి
నౌకరు కావలసి వచ్చింది.
ఆవిషయం తెలిసిన ఇద్దరు
వ్యక్తులు వెళ్ళి తమకు
పని ఇమ్మని అడిగారు. ఆయనకుకావలసింది
ఒక్కరే గనుక, వారికి ఒక
పరీక్ష పెట్టారు. ఇద్దరకీ
తలో గంప ఇచ్చి, నూతిలో
నీళ్ళు తోడి ఆ గంపలలో
నింపమన్నారు.
సరే! ఇద్దరూ పని ప్రారంబించారు.
గంపలో నీళ్ళు పోస్తే
నిలవవుకదా. ఒక గంటసేపు
తోడాక ఒకనికి విసుగేసి,
ఈ యనకుమతిలేదు. నీళ్ళు
కారిపోతున్న గంపలో నీళ్ళుపోయడమేమిటి?
ఇల్లాంటి మతిలేనివాడి
దగ్గర పనిచేయడంకన్న బుద్ధి
తక్కువ పని ఇంకోటి లేదు
అన్నాడు.
నీళ్ళు వుంటాయో, కారిపోతాయో,
మనకెందుకు ? మనపని సాయంత్రందాకా
నీళ్ళు పొయ్యడమే అని
రెండోవాడు అన్నాడు. అయినా
మొదటివాడువినక, విసవిసా
నడిచి వెళ్ళిపోయాడు.
రెండోవాడు నీళ్ళుతోడుతున్నాడు.
గంపలో పోస్తున్నాడు.
సాయంత్రం అయ్యేసరికి
నూతిలో నీళ్ళూ అయిపోయాయి.
ఆశ్చర్యం ఆ గంపలో ఒక బంగారువుంగరం
కనపడింది. దానిని తీసుకువెళ్ళి
ధనవంతునికి ఇచ్చి అయ్యా!
నూతిలో నీళ్ళు అయిపోయాయి.
ఈ వుంగరం తోడిన నీళ్ళతో
బాటు వచ్చింది అని ఇచ్చాడు.
ధనవంతుడు సంతోషించి
అతనిని పనిలో పెట్టుకోడమేగాక,
వుంగరం కూడా బహుమతిగా
ఇచ్చేసాడు.
పనిలో సహనం నిజాయితీ
వుండాలి అని ఈకధలోని
నీతి.
****************************************
విలువైన కాలం వృధాచేసుకోకు
ఒకసారి శ్రీరామక్రిష్ణపరమహంస
దగ్గరకు ఒక శిష్యుడు
గబగబా వచ్చి స్వామీ నేను
పది సంవత్సరాలు తపస్సు
చేసి హుగ్లీ నదిమీద నడిచే
శక్తి సంపాదించా అన్నాడు
ఎంతో గర్వంగా
అయ్యో పిచ్చివాడా!
పావలా యిస్తే పడవమీద
నది దాటగలిగేదానికోసం
పది సంవత్సరాల విలువైన
కాలం వృధా చేసావా! అని
బాధపడ్డారుట. కాలం ఎంతో
విలువైనది. సద్వినయోగం
చేసుకోవడంలోనే వుంది
మానవుని బుద్ధి కుశలత
*****************************************************
మతమౌఢ్యం
ఒక కాలువ వడ్డున కాలవదాటే
ప్రయాణీకులకోసం పందిరి
ఒకటి వేసారు. ఆ వూళ్ళో
శైవులకు, వైష్ణవులకు
నిత్యం పోట్లాటే. ఒకరోజు
మధ్యాహ్నం కొంతమంది ప్రయాణీకులు
కాలువదాటేందుకు ఆవతలవడ్డుకు
వెళ్ళిన బల్లకట్టు కోసం
నిరీక్షిస్తు కూర్చున్నారు.
వారిలో ఒక శైవుడు తలపైకెత్తి
పందిరికేసి చూసి 'ఆహా!
మన అడ్డ బొట్టేకదా ఈ పందిరిపైన
తాటాకులకు ఆధారం ' అన్నాడు.
అడ్డబొట్టు అంటే అడ్డంగావేసిన
వెదుళ్ళు అని అతని వుద్దేశ్యం.
వెంటనే అక్కడేవున్న
ఒక వెష్ణవస్వామి లేచి
'ఏమంటిరి ఏమంటిరి! మా నిలువు
బొట్లు లేనిదే మీ అడ్డబొట్లు
దేనిమీద నిలవగలవు? కనుక
ఈ పందిరి మొత్తానికి
నిలువు బొట్లె ఆధారం
అన్నాడు. అవును అవును
అని వీర వైష్ణవులు వంత
పలికారు. అతని వుద్దేశ్యం
నిలువు బొట్లు అంటే నిలువునాపాతిన
సర్వీబాజురాటలు అని.
'ఏడిసారు! మీ నిలువు బొట్లు
వుండి ఏంప్రయోజనం? అవి
నీడ నిస్తాయా ఏమన్నానా?
అన్నారు వీ.శైలు. వీ.వై
లకు వళ్ళుమండి తాటాకుల్ని
అడ్డంగావేసిన వాసాలని
పీకిపారేసారు. మరి వీ.శైలు
మాత్రం తక్కువతిన్నారా!!
వాళ్ళు నిలువుగా పాతిన
సర్వీబాజురాటల్ని పీకేసారు.
మిగిలిన అమాయక జనం ఎండవేడికి
ఘొల్లు మన్నారు. ఓం నమో
నారాయణా! హర హర మహాదేవ
శంభోశంకరా! పాహిమాం పాహిమాం
************************************************
అపాయంలో నిదానం
ప్రధానం రచన: కాలనాధభట్ట
వీరభద్ర శాస్త్రి
రెండు కప్పలు అస్రదాగా
కబుర్లు చెప్పుకుంటూ
గెంతుతూ ఒక ఇంట్లోకి
దూరాయి. అల్లా ఎగురుతూ
వెళ్ళడంలో రెండూ ఒక పాక
గిన్నెలో పడ్డాయి. కప్పలు
ఒక గెంతుగెంతి పైకి రావాలని
ప్రయత్నించాయి గాని,
గిన్నె లోతు ఎక్కువుగా
వుండడంతో పైగా కాళ్ళకింద
నొక్కి ఎగిరే ఆధారం లేకపోవడంతో
పైకి రాలేకపోయాయి. ఒక
కప్ప వూరుకోకుండా గెంతాలని
ఊ ప్రయత్నం చేస్తూనేవుంది.
అల్లా ప్రయత్నం చేసి
చేసి అలసిపోయి చివరకి
ప్రాణాలు వదిలింది. రెండో
కప్ప అల్లా కాకుండా కాళ్ళతో
తపతపా కొట్టుకోసాగింది.
అల్లా కొట్టుకోవడంలో
పాలు చిలికినట్టాయి,
కొంతసేపటకి పాలలో వెన్న
పైకితేలింది. కప్ప ఆ వెన్న
ముద్ద ఆధారంతో ఒక్కవూపులో
పైకి గెంతి గిన్నెలోంచి
బయటకి వచ్చేసింది.
అపాయంలో వున్నప్పుడు
నిదానించి వుపాయంగా తప్పించుకోవాలి. **************************
ఆషాఢభూతి కధ
రచన: కాలనాధభట్ట వీరభద్ర
శాస్త్రి
దేవశర్మ అనె సన్యాసి
వేదాంత ఉపన్యాసాలిస్తూ
దేశాటన చేసేవాడు. భక్తులు
ఆయనకు గౌరవంతో ధనాన్ని
దక్షిణగా ఇచ్చేవారు.
అలా వచ్చిన ధనాన్ని అతడు
ఒక బొంతలో పెట్టి జాగ్రత్తగా
చూచుకొనేవాడు. ఒక మోసగాడు
ఆ విషయం గ్రహించి దానిని
ఎలాగైనా సంగ్రహించాలని
అనుకున్నాడు. అతని పేరు
ఆషాఢభూతి. ఆషాఢభూతి ఒకరోజు
సన్యాసి వద్దకుపోయి,
విసనకర్రతో విసరుతూ,
'స్వామీ సంసార విరక్తుడనైన
నన్ను తమ శిష్యునిగా
చేర్చుకోండి. నాజీవితాన్ని
మీపాదసేవలో గడపాలని అనుకుంటున్నాను'
అన్నాడు. ఆషాఢభూతి మాటలు
విని సన్యాసి ఎంతో సంతసించాడు.
శిష్యునిగా చేర్చుకున్నాడు.
ఎక్కడకి వెళ్ళినా అతనిని
తనవెంటపెట్టుకొని వెళ్ళేవాడు.
తనసామాను అంతటినీ అతనితో
మోయించేవాడు. కాని ధనంవున్న
బొంతను మాత్రం అతని చేతికి
ఇచ్చేవాడుకాదు. ఊళ్ళుతిరుగుతూ
ఆ గురుశిష్యులు ఒక గ్రామంలో
రెండురోజులు బస చేసారు.
తర్వాత నుంచి మరోచోటకి
బయల్దేరారు. 'స్వామీ మనం
బస చేసిన ఇంటివారి పూచికపుల్ల
ఒకటి నా పంచెకు అంటుకొంది.
పరుల సొమ్ము పూచికపుల్లైనా
అపహరించడం మహా పాపం అన్నారుకాదా
మీరు! కనుక వారి పూచికపుల్లను
వారికిచ్చి వస్తాను'
అన్నాడు ఆషాఢభూతి ఆ మటలకు
సన్యాసి ఎంతో ఆనందించి,
'శిష్యా నీ బుద్ధికి మెచ్చాను,
వెళ్ళిరా' అన్నాడు. ఆషాఢభూతి
వెంటనే వెళ్ళినట్లే వెళ్ళి
దారిలో కొంతసేపు కూర్చుని
తిరిగి సన్యాసి దగ్గరకు
వచ్చాడు. ఆషాఢభూతిని
చూసి, 'పరుల సొమ్ముమీద
కోరికలేని ఇతన్ని నమ్మ
వచ్చు' అనుకున్నాడు.సన్యాసి.
అప్పటినుండి ధనం దాచుకున్న
బొంతనుకూడా ఆషాఢభూతి
చేత మోయించసాగాడు. ఒకరోజు
వారిద్దరూ అడవిలోంచి
ప్రయాణిస్తున్నారు. దారిలో
ఒక చెరువు కనిపించింది.
సన్యాసి ఆ చెరువులో స్నానం
చేయాలనుకున్నాడు. ఆషాఢభూతిని
గట్టుమీద వుండమనితను
చెరువులోకి దిగాడు. అదేసమయంలో
చెరువు అవతల గట్టుమీద
రెండు పొట్టేళ్ళు హోరాహోరీగా
పోట్లాడుకుంటున్నాయి.
వాటి తలలు చిట్లి నెత్తురుకారి
నేలమీద పడి గడ్డ కట్టింది.
అప్పుడే అక్కడకు వచ్చిన
ఒక నక్క గడ్డ కట్టిన నెత్తురుచూసి
మాంసం ముద్ద నుకుని దాని
వద్దకు వెళ్ళింది. వెనువెంటనే
అది పోట్లాడుకుంటున్న
పొట్టేళ్ళ మధ్య పడి నలిగి
చచ్చింది. ఈ దృశ్యాన్ని
చూసిన సన్యాసి 'దురాశవల్ల
నక్కకి ఈ దుర్గతి పట్టిందికదా'
అనుకున్నాడు. తర్వాత
గట్టుమీదకు వచ్చాడు.
ఆషాఢభూతి కనిపించలేదు.
'శిష్యా ఆషాఢభూతీ' అని
ఎంత పిలిచినా జవాబు లేదు. ఆషాఢభూతి
మోసంచేసి, ధనం దాచుకున్న
తన బొంతను ఎత్తుకు పోయాడని
సన్యాసికి అర్ధం అయింది.
'ఆ పొట్టేళ్ళ వల్ల నక్క
చనిపోయింది. ఆషాఢభూతి
వల్ల నేను మోసపోయాను'
అనుకున్నాడు సన్యాసి (పంచతంత్రం
నుండి సేకరణ)
*********************
|